Tuesday, September 30, 2014

కోకిలమ్మ పదాలు


కోకిలమ్మ పదాలు
కోకిలమ్మ పదాలు

అపురూప భావాలు
అలవోక గమనాలు
ఈ కవిత ప్రాణాలు
  ఓ కోకిలమ్మా!

....................................................................
అదృష్టదీపక్   -9- కోకిలమ్మ పదాలు

2.   తీయతేనెల వాణి
    నీవు పాటకు రాణి
    నాదు కవితకు బాణి
        ఓ కోకిలమ్మా!

3.   అలతి అలతి పదాలు
       కొలువైన సరదాలు
     తొలగించు పరదాలు
         ఓ కోకిలమ్మా!

4.    వాస్తవం ఒకపాలు
      వ్యంగ్యం మరోపాలు
     చిట్టి కవితకు చాలు
         ఓ కోకిలమ్మా!

5.         రసజ్ఞతగల చోట
      రాణించు నామాట
      మధువులొలికే పాట
         ఓ కోకిలమ్మా!

....................................................................
అదృష్టదీపక్   -10- కోకిలమ్మ పదాలు


6.   అక్షరాలకు శోష
     అస్పష్టకవి భాష
     మనకెందుకా ఘోష
        ఓ కోకిలమ్మా! 

7.      మానవత శోభిల్లు
    మమతలకు పందిళ్ళు
       మండువా లోగిళ్ళు
          ఓ కోకిలమ్మా!

8.  రెండు మనసుల కలుపు
    వైవాహికపు వలపు
    జీవితపు తొలిమలుపు
         ఓ కోకిలమ్మా!

9.   నిండుపున్నమ రేయి
    ప్రేమ పెదవుల దోయి
      కలసినపుడే హాయి
       ఓ కోకిలమ్మా!

...................................................................
అదృష్టదీపక్   -11- కోకిలమ్మ పదాలు


10.   కొత్తవలపుల జంట
      కోరికల చలిమంట
      బతుకు బంగరుపంట
      ఓ కోకిలమ్మా!

11.  పొరుగుమెడలో గొలుసు
     పొలతి కంట్లో నలుసు
     ఖర్చు మగనికి తెలుసు
      ఓ కోకిలమ్మా!

12.   ప్రతివస్తువుకు పన్ను
      అంటుచున్నది మిన్ను
      ప్రజలు తినవలె మన్ను
            ఓ కోకిలమ్మా!

13.  ధరలు పెరిగినచోట
        కలల వేలంపాట
     బతుకు కాలిన తోట
          ఓ కోకిలమ్మా!


...................................................................
అదృష్టదీపక్   -12- కోకిలమ్మ పదాలు 


14.   నిరుపేద రూపాయి
     నీరసపు పాపాయి
     నడవలేని సిపాయి
       ఓ కోకిలమ్మా!

15.  చక్రవడ్డీ పద్దు
     అసలుకంటే హద్దు
     మీరుచుండుట కద్దు
      ఓ కోకిలమ్మా!

16.   వీక్షకులపై కక్ష
      విలువలకు ఉరిశిక్ష
      తెలుగు సినిమా దీక్ష
       ఓ కోకిలమ్మా!

17.   సినిమాలలో ముద్దు
      మనకెందుకది వద్దు
      ఉండవలెనొక హద్దు
         ఓ కోకిలమ్మా!


...................................................................
అదృష్టదీపక్   -13- కోకిలమ్మ పదాలు






18.  నేటి సినిమాలందు
     సెక్సు రక్కసి చిందు
     లాట కట్టెటులందు
         ఓ కోకిలమ్మా!

19.  కాముకత్వము హెచ్చి
          కళను నిద్దురపుచ్చి
          రగిలె సినిమా పిచ్చి
             ఓ కోకిలమ్మా!

20.   బొంబాయికొకతీరు
       మద్రాసుకొకతీరు
      సినిమాల సెన్సారు
           ఓ కోకిలమ్మా!

21.  నగ్నవాంచలహోరు
       భగ్నప్రేమల తీరు
      ఆత్మహత్యల జోరు
         ఓ కోకిలమ్మా!
    
...................................................................
అదృష్టదీపక్   -14- కోకిలమ్మ పదాలు

22.  అసమానతలు తుదకు
      అంతరించే వరకు
      అతివ అంగడి సరుకు
           ఓ కోకిలమ్మా!

23.  మనిషి మేధకు సతము
        మసిని పూసే మతము
        కూల్చుటే నా  వ్రతము
             ఓ కోకిలమ్మా!

24.  గుళ్ళుచుట్టే కాళ్ళు
       భజనచేసే నోళ్ళు
       బానిసల చేవ్రాళ్ళు
          ఓ కోకిలమ్మా!

25.    భుతాలు దయ్యాలు
          మూఢ విశ్వాసాలు
          రాతియుగశేషాలు
               ఓ కోకిలమ్మా!


...................................................................
అదృష్టదీపక్   -15- కోకిలమ్మ పదాలు




26.  పంచాంగ పఠనాలు
      ప్రతిపనికి శకునాలు
      ప్రగతికవరోధాలు
         ఓ కోకిలమ్మా!

27.  మంచి పెంచనివాడు
      చెడును త్రుంచనివాడు
      దేవదేవుడు ఘనుడు
            ఓ కోకిలమ్మా!

28.  అవినీతి పాఠాలు
      ఆధ్యాత్మ పీఠాలు
      విలువలకు `టాటా' లు
            ఓ కోకిలమ్మా!

29.   అతివ పెదవుల చొంగ
            అందలేదని బెంగ
       స్వాములోరొక దొంగ
              ఓ కోకిలమ్మా!


  అదృష్టదీపక్  -16- కోకిలమ్మ పదాలు

30.  జగద్గురు రాజ్యాలు
      హైటెక్కు చోద్యాలు
      సెక్సు నైవేద్యాలు
           ఓ కోకిలమ్మా!

31.  తుమ్మితే సారాయి
        దగ్గితే సారాయి
     హాబీలు మారాయి
          ఓ కోకిలమ్మా!

32.  నోట సారాచుక్క
      మాట తూలే తిక్క
     బతుకు తప్పుడు లెక్క
          ఓ కోకిలమ్మా!

33.  దారితప్పిన వారి
      చావులకు రహదారి
      సారా మహమ్మారి
          ఓ కోకిలమ్మా!

 
 అదృష్టదీపక్  -17- కోకిలమ్మ పదాలు   

34.  సారా దుకాణాలు
      నింపే ఖజానాలు
     పాలకుల ప్రాణాలు
        ఓ కోకిలమ్మా!

35.  వయసు పొద్దులు గ్రుంక
         మనసు ఎక్కెను చంక
         వలపు బంగరు జింక
                ఓ కోకిలమ్మా!

36.  ఇంతి పరుగుల జోరు
      ఇంటిలోపలి పోరు
     మునిగె యంటీయారు
            ఓ కోకిలమ్మా!

37.  ఆలిమాటలు నమ్మి
      అంతరాత్మను కుమ్మి
      చేసె తిమ్మిని బమ్మి
              ఓ కోకిలమ్మా!


 అదృష్టదీపక్  -18- కోకిలమ్మ పదాలు   

38.  పాడుబుద్ధుల కత్తి
      పత్రికలపై ఎత్తి
      బొప్పి తిన్నది నెత్తి
         ఓ కోకిలమ్మా!

39.    అహంకారము జాస్తి
         ఆలోచనలు నాస్తి
         తుదకు జరిగెను శాస్తి
                ఓ కోకిలమ్మా!

40.  తాత తాగిన నేతి
      పాతవాసన మూతి
      చూపించెనొక కోతి
           ఓ కోకిలమ్మా!

41.  నిన్న ఇందిరగాంధి
      నేడు ఇటలీ గాంధి
      ఎన్నాళ్ళు ఈ రంధి
            ఓ కోకిలమ్మా!

 
 అదృష్టదీపక్  -19- కోకిలమ్మ పదాలు

42.  ప్రజాస్వామ్యపు ముసుగు
      ప్రభుత నిండా లొసుగు
      పుట్టించెనిక విసుగు
          ఓ కోకిలమ్మా!

43.  వట్టిమాటలు దంచి
       కట్టుకథల విపంచి
       కడకు చేరును కంచి
            ఓ కోకిలమ్మా!

44.  అణుయుద్ధ తంత్రాలు
      ఆక్రమణ సూత్రాలు
      అమెరికులగోత్రాలు
          ఓ కోకిలమ్మా!

45.  ఉగ్రవాదుల దన్ను
       ఒసామా లాడెన్ను
       పాక్ ఒడిలో గన్ను
          ఓ కోకిలమ్మా!


 అదృష్టదీపక్  -20- కోకిలమ్మ పదాలు 


 46.  ఉగ్రవాదపు కత్తి
       అగ్రరాజ్యపు నెత్తి
      మీద జారిన మిత్తి
         ఓ కోకిలమ్మా!

47. ఎదురులేదని విర్ర
       వీగుచుండే కర్ర
       పెత్తనానికి తొర్ర
        ఓ కోకిలమ్మా! 

 48.   అఫ్గాను చిట్టెలుక
         అదుపు తప్పిన నడక
        గమ్యమెవరికి ఎరుక
             ఓ కోకిలమ్మా!

49.    అవనికే భయపెట్టు
        అమెరికా  లోగుట్టు
        అయ్యిందిలే రట్టు
            ఓ కోకిలమ్మా!


...........................................................................................
అదృష్టదీపక్     -21-   కోకిలమ్మ పదాలు

 50.    సామ్రాజ్యవాదాలు
         సర్వమతభేదాలు
         భువిలో ప్రమాదాలు
            ఓ కోకిలమ్మా!

51.      మేధావి శాతాలు
          తగ్గే ఉపాయాలు
          విద్యావిధానాలు
             ఓ కోకిలమ్మా!

52.     బుక్స్ మోతకు బరువు
         భావి భద్రత కరువు
         గుండెకాదా చెరువు
              ఓ కోకిలమ్మా!

53.   నిరంతర శ్రామికులు
       పరభాష  ప్రేమికులు
       కాన్వెంటు  కార్మికులు
          ఓ కోకిలమ్మా!


...........................................................................................
అదృష్టదీపక్     -22-   కోకిలమ్మ పదాలు

54.     మెకాలే నేస్తాలు
         రేపటి గుమాస్తాలు
         బిగిలేని హస్తాలు
           ఓ కోకిలమ్మా!

55.    అమెరికన్ డాలర్లు
            వేటాడు జాలర్లు
        గ్రీన్ కార్డ్ హోల్డర్లు
               ఓ కోకిలమ్మా!

56.   పచ్చకార్డుల మోజు
       పిచ్చిముదిరిన రోజు
       ఎదకు పట్టును బూజు
            ఓ కోకిలమ్మా!

57.    అమెరికాలో కొలువు
        సంపాదనకు నెలవు
        మమతలకు ఇక సెలవు
             ఓ కోకిలమ్మా!


...........................................................................................
అదృష్టదీపక్     -23-   కోకిలమ్మ పదాలు

 58.  అక్రమాలకు అండ
       ప్రజలనెత్తిన బండ
       అవినీతి అనకొండ
           ఓ కోకిలమ్మా!

59.  అవినీతి చిట్టాలు
      పసలేని చట్టాలు
      పాలకుల చుట్టాలు
          ఓ కోకిలమ్మా!

60.   పదవి బంగరు మొలక
       పంచవన్నెల చిలక
       వైరి కంట్లో నలక
            ఓ కోకిలమ్మా!

61.  ఆరోపణల పంట
     వైరిపక్షం వంట
     కుదరకుంటే మంట
         ఓ కోకిలమ్మా!


...........................................................................................
అదృష్టదీపక్     -24-   కోకిలమ్మ పదాలు


62.  పిచ్చికేకల వరద
      పచ్చిబూతుల  బురద
      రాజకీయం దురద
.          ఓ కోకిలమ్మా!

63.    నీవు చేస్తే తప్పు
       నేను చేస్తే ఒప్పు
       ఎన్నికల మేకప్పు
           ఓ కోకిలమ్మా!

64.   కల్లబొల్లి కబుర్లు
       కడుపునిండా దొర్లు
       నాయకులు జోకర్లు
          ఓ కోకిలమ్మా!

65.  తన శరీరము క్రింద
      నలుపున్న గురివింద
         చేసెనట పరనింద
              ఓ కోకిలమ్మా!


...........................................................................................
అదృష్టదీపక్     -25-   కోకిలమ్మ పదాలు

66.  నిన్న దిగదీస్తారు
      నేడు ఎగదోస్తారు
      రంగు మారుస్తారు
             ఓ కోకిలమ్మా!

67.   అంతరాత్మను చంపు
      రాజకీయపు కంపు
      పార్టీ ఫిరాయింపు
           ఓ కోకిలమ్మా!

68.   చిటపటలు సిగపట్లు
       సీట్లకై అగచాట్లు
       చక్కదిద్దుట ఎట్లు
              ఓ కోకిలమ్మా!

69.   కుడి ఎడమ పనిలేని
       కుప్పిగంతుల వాని
       మాట వింటే హాని
              ఓ కోకిలమ్మా!


...........................................................................................
అదృష్టదీపక్     -26-   కోకిలమ్మ పదాలు

70.  ప్రాంతీయ తత్వాలు
      పరమత ద్వేషాలు
      ఫాసిస్టు సరదాలు
           ఓ కోకిలమ్మా!

71.     దుష్టజన రక్షకులు
         శిష్టజన భక్షకులు
         పొలిటికల్ తక్షకులు
             ఓ కోకిలమ్మా!

72.   అయిదేళ్ళకో సారి
       అవతరించే వారి
       ఓటమికిదే దారి
           ఓ కోకిలమ్మా!

73.   రాజకీయుల  నోట
        రామరాజ్యం పాట
        పదవికోసం వేట
               ఓ కోకిలమ్మా!


...........................................................................................
అదృష్టదీపక్     -27-   కోకిలమ్మ పదాలు

74.  ఎన్నికల్లో నోట్లు
     ఇచ్చిపొందిన వోట్లు
     ఇండియాలో కోట్లు
      ఓ కోకిలమ్మా!

75. ఒక్క సారా చుక్క
     నోట మాంసం ముక్క
     కాదు వోటుకి లెక్క
        ఓ కోకిలమ్మా! 

76.  అణ్వాయుధం వోటు
      అవినీతిపై వేటు
      అమ్ముకుంటే చేటు
        ఓ కోకిలమ్మా!

77.  పదవి పల్లకి నెక్కి
      ప్రజల సొమ్మును మెక్కి
      తుదకు చేయు హుళక్కి
         ఓ కోకిలమ్మా!

.......................................................................
అదృష్టదీపక్  - 28- కోకిలమ్మ పదాలు

78.  ప్రజా రచయిత నోట
       ప్రభవించు ప్రతిమాట
       సమత కోరే పాట
           ఓ కోకిలమ్మా!

79.  బెంగాల్  కావచ్చు
      వియత్నాం కావచ్చు
      విప్లవం కార్చిచ్చు
          ఓ కోకిలమ్మా!

80.    ప్రజాపోరాటాలు
       పల్లవించిన చాలు
       గుడ్డిప్రభుతలు కూలు
           ఓ కోకిలమ్మా!

81.  సంఘవైరుధ్యాలు
     సమర వాయిద్యాలు
     వేమన్న పద్యాలు
        ఓ కోకిలమ్మా!

....................................................................
అదృష్టదీపక్  - 29- కోకిలమ్మ పదాలు

  82.  వెండితెర నవరాత్రి
        సరిలేని అభినేత్రి
        మహానటి సావిత్రి
            ఓ కోకిలమ్మా!

83. గయ్యాళి గుండమ్మ
     మన సూర్యకాంతమ్మ
     మనసు వెన్నగదమ్మ
          ఓ కోకిలమ్మా!

84.  నేపాళ మాంత్రికుడు
      హై హై ఘటోత్కచుడు
      జకార్తా కీచకుడు
            ఓ కోకిలమ్మా!

85    నటనలో పైమెట్టు
        విశ్వనట సమ్రాట్టు
        యస్వియార్ ఎవరెస్టు
             ఓ కోకిలమ్మా!

............................................................................
    అదృష్టదీపక్  - 30- కోకిలమ్మ పదాలు

86.   కొంటె ఊహల బాపు
       కుంచె చూసిన చూపు
       ఎడద నవ్వులు రేపు
          ఓ కోకిలమ్మా!

87.    చిలిపి చేష్టల పిడుగు
         చిక్కలేదా బుడుగు
         ముళ్ళపూడిని అడుగు
            ఓ కోకిలమ్మా!

88.    వ్యంగ్యాన్ని ఎదురొడ్డి
        విరిచె శత్రువు నడ్డి
        వికట మల్లారెడ్డి
           ఓ కోకిలమ్మా!

89.   కార్టూను చురకత్తి
       కవిత వెలిగే వత్తి
      రాంభట్ల సమవర్తి
         ఓ కోకిలమ్మా!

...................................................................
 అదృష్టదీపక్  - 31-  కోకిలమ్మ పదాలు

90.  గండ్రగొడ్డలి గళము
      చండ్రనిప్పుల దళము
      రా. రా. కలం బలము
         ఓ కోకిలమ్మా!

91.  నిప్పులాంటి నిజాలు
      నిక్కచ్చి కథనాలు
      రావిశాస్త్రీయాలు
        ఓ కోకిలమ్మా!

92.  వధ్య శిలపై ప్రజలు
       మధ్యతరగతి వ్యధలు
       కొ.కు. మథించిన కథలు
           ఓ కోకిలమ్మా!

93.  స్త్రీవాద వాచకం
     విషవృక్ష నాశకం
     రణ రంగనాయకం
         ఓ కోకిలమ్మా!

.....................................................................
 అదృష్టదీపక్  - 32-  కోకిలమ్మ పదాలు

94.  సంగీతమొక కన్ను
      సాహిత్యమొక కన్ను
      ఆదిభట్లకు చెన్ను
         ఓ కోకిలమ్మా!

95.    జాతికొరకు తపస్సు
        హేతువాద ఉషస్సు
        కందుకూరి మనస్సు
             ఓ కోకిలమ్మా!

96.   తేటమాటల మనసు
       తెలుగు వెలుగుల సొగసు
       గిరాంమూర్తికి తెలుసు
           ఓ కోకిలమ్మా!

97.   ప్రజల భాషకు గొడుగు
       గ్రాంథికానికి పిడుగు
       కొత్తదారుల గిడుగు
           ఓ కోకిలమ్మా!

..................................................................................................
అదృష్టదీపక్  - 33-  కోకిలమ్మ పదాలు

98.  ప్రగతి అడుగుల జాడ
      ప్రజాకవి గురజాడ
      శ్రీ శ్రీకి గురుజాడ
          ఓ కోకిలమ్మా!

99.  గురజాడ జనభాష
      శ్రీశ్రీది రణభాష
      తెలుగు వెలుగుల శ్లేష
           ఓ కోకిలమ్మా!

100.  వికృతులను దునుమాడు
        వేమన్న మొనగాడు
        శ్రీశ్రీకి సరిజోడు
             ఓ కోకిలమ్మా!

101.   మార్క్సిస్టు విజిగీష
         మార్పుకై రణఘోష
         ఎరుపు శ్రీశ్రీ భాష
             ఓ కోకిలమ్మా!


..................................................................................................
అదృష్టదీపక్  - 34-  కోకిలమ్మ పదాలు


102.   ఏకవచనం వ్యక్తి
        బహువచనమున శక్తి
        శ్రీశ్రీ అభివ్యక్తి
             ఓ కోకిలమ్మా!

103.  సమతకోసం ఆర్తి
        యువత కోరే స్పూర్తి
        నవత  శ్రీశ్రీ కీర్తి
           ఓ కోకిలమ్మా!

104.  రణభేరి మ్రోగించి
       రగిలె ప్రజల గురించి
       రెండు శ్రీల విరించి
           ఓ కోకిలమ్మా!

105.  పీడకుల ప్రతికక్షి
        పీడిత నిటాలాక్షి
        శ్రీశ్రీ మనస్సాక్షి
            ఓ కోకిలమ్మా!


..................................................................................................
అదృష్టదీపక్  - 35-  కోకిలమ్మ పదాలు

106.  శబ్దార్థముల మేటి
        శరపరంపర ధాటి
        లేరు శ్రీశ్రీ సాటి
           ఓ కోకిలమ్మా!

107.   విప్లవం తన ఆశ
         విప్లవం తన ధ్యాస
          అదే శ్రీశ్రీ శ్వాస
               ఓ కోకిలమ్మా!

108.  ప్రజల పోరుకు దన్ను
       ప్రతిన పూనిన గన్ను
       నిజం శ్రీశ్రీ పెన్ను
           ఓ కోకిలమ్మా!

109.  సమవాద పరమేష్ఠి
        శ్రమవిలువ తనదృష్టి
        ఖడ్గశ్రీశ్రీ సృష్టి
              ఓ కోకిలమ్మా!


.................................................................................................
అదృష్టదీపక్  - 36-  కోకిలమ్మ పదాలు

అనుభవమ్ముల దీప్తి

శతపదమ్ముల వ్యాప్తి

చేయుచుంటి సమాప్తి

  ఓ కోకిలమ్మా!

                             - అదృష్టదీపక్
       ................................................................     
                   

అదృష్టదీపక్
18-01-1950
అదృష్టదీపక్
కథనం జలపాత వేగం
                                      కవనం అభ్యుదయయాగం
                                      ఆశయాల పందిరిలో
                                      అదృష్టదీపక రాగం


దీపకరాగం
రచన: సింగంపల్లి అశోక్ కుమార్
          .............
``యువర్ ఎటెన్షన్ ప్లీజ్ - అన్యాయానికి శస్త్ర చికిత్సచేసి న్యాయాన్ని
బ్రతికించడంకోసం సమర్ధవంతమైన ఆయుధాన్ని సాధనంగా ఎన్నుకోండి '' అనే తీవ్ర నినాదంతో కళాశాల ఎన్నికల్లో పోటీచేసి విద్యార్ధులలో సంచలనం రేపిన అతి మిలిటెంట్ విద్యార్ధీ - ``ఎర్రజెండాయే నా ఎజెండా '' అంటూ ఆర్ధిక అసమానతలపై అక్షరయుద్ధం ప్రకటించిన రాజీలేని కలంవీరుడూ అయిన అదృష్టదీపక్ విద్యార్ధి సమాఖ్య, యువజన సమాఖ్య, అరసం, ప్రజా నాట్యమండలి సంస్థలలో క్రియాశీలంగా ఎన్నో బాధ్యతలు నిర్వహించాడు. నిబద్ధకవిగా, కథకుడిగా, బుర్రకథా రచయితగా,
వ్యాసకర్తగా, కాలమిస్టుగా, విమర్శకుడిగా, ఉపన్యాసకుడిగా, నటుడిగా, గాయకుడిగా,సినీగేయ రచయితగా - అన్ని రంగాలలోనూ బలమైన ముద్రవేసిన బహుముఖ ప్రజ్ఞశాలి అదృష్టదీపక్.

తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో 1978లో ఎం.ఏ.చరిత్రలో పట్టభద్రుడయ్యాక 1979లో అదే జిల్లాలోని ద్రాక్షారామం పి.వి.ఆర్. జూనియర్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరి 2008లో రిటైరయ్యేంతవరకూ అక్కడే పనిచేశాడు. రిటైరైన తరువాత తన సమస్త కార్యాచరణకు కేంద్రమైన రామచంద్రపురంలో సొంత ఇంట స్థిరపడ్డాడు.

కమ్యూనిస్టు కుటుంబ నేపథ్యంనుంచివచ్చిన అదృష్టదీపక్. 1962లో సాహిత్య వ్యాసంగం ప్రారంభించి చైతన్యవంతమైన సాహితీసృజన చేశాడు. కోకిలమ్మ పదాలు(1972) అగ్ని(1974) ప్రాణం (1978), అడవి (2008), కవితా సంపుటాలు, సమరశంఖం (1981) బుర్రకథ, దీపకరాగం (2008) వ్యాస సంపుటి, ఆశయాల పందిరిలో(2010) సినిమాపాటలు, శ్రీశ్రీ ఒక తీరనిదాహం (2010) - అచ్చులోవెలువడిన అదృష్టదీపక్ రచనలు.

1974లో తూ.గో.జిల్లా అరసం ప్రచురించిన `చెతన ' కవితా సంకలనానికి సంపాదకత్వం వహించాడు. విశాలాంధ్ర, స్వాతి, వికాసం మొదలగు పత్రికలూ, సంస్థలూ నిర్వహించిన పోటీలలో ఉత్తమ కవిగానూ, ఉత్తమ కథారచయితగానూ బహుమతులు పొందాడు.

అనేక ప్రసిద్ధ సంకలనాలలో దీపక్ రచనలు చోటుచేసుకున్నాయి.  బెర్ట్రోల్డ్ బ్రెహ్ట్, పేబ్లో నెరూడాల కొన్ని కవితలను తెలుగులోకి అనువదించాడు. దీపక్ రాసిన కొన్ని కవితలను ప్రముఖ కవి నిర్మలానంద వాత్సాయన్ హిందీలోకి అనువదించారు.

విద్యార్ధి దశలోనే జోకర్ మాసపత్రికలో `కాలింగ్ బెల్ ' సిర్షికను నిర్వహించాడు. ఆతరువాత ఉదయం దినపత్రికలో ఒక సంవత్సరం ప్రతి ఆదివారం `పదసంపద 'శీర్షిక నిర్వహించాడు. విజయవాడ నుంచి వెలువడుతున్న `చినుకు ' మాసపత్రికలో మూడేళ్ళపాటు
`దీపకరాగం ' శీర్షికతో చేసిన సాహిత్య దీపక్ సాహిత్య `శరామర్శ ' పలు ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం `ఫన్ డే ' లో ప్రారంభ సంచికనుంచీ `పదశోధన ' శీర్షిక నిర్వహిస్తున్నాడు.

అనేక ప్రతిష్ఠాత్మక సాహితీ పురస్కారాల ఎంపికలో న్యాయ నిర్ణేతగా వ్యవహరించాడు.
ఎన్నో నాటక కళాపరిషత్తులలో ఉత్తమ నటుడు, ఉత్తమ హాస్యనటుడు, ఉత్తమ కేరక్టర్ నటుడు మొదలగు అవార్డులు పొందాడు. గత ఇరవై అయిదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో అనేక ప్రముఖ నాటక కళాపరిషత్తులలో న్యాయ నిర్ణేతగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంటర్ కాలేజియేట్ యూత్ ఫెస్టివల్స్లో - నాటికలు, లలిత సంగీతం, బృందగానాలు, మొదలగు అనేక అంశాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు. 1980లో మాదాల రంగారావు ద్వారా `యువతరం కదిలిందీ చిత్రంలో `ఆశయాల పందిరిలో ' గీతరచనతో సినిమా రంగ ప్రవేశం చేశాడు.

ఏడేళ్ళ వయసులో గాయకుడిగానూ, తొమ్మిదేళ్ళ వయసులో నటుడిగానూ,
పన్నెండేళ్ళ వయసులో రచయితగానూ కళా జీవితాన్ని ప్రారంభించిన
దీపక్, సాహిత్య సాంస్కృతిక రంగాలలో ప్రదర్శించిన ప్రజ్ఞా పాటవాలకు
అనేక అవార్డులూ రివార్డులూ పొందాడు.

 1. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ ద్వారా `నేటిభారతం' చిత్రంలో`మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం' గీతానికి ఉత్తమ గేయ రచయితగా మద్రాసులో `కళాసాగఋ అవార్డు (1984)
2. ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ద్వారా రాష్ట్ర ప్రభుత్వ
 ఉత్తమ అధ్యాపక అవార్డు (2003)
3. విశాలాంధ్ర ప్రచురణాలయం స్వర్ణోత్సవ వేడుకలలో కవిసత్కారం (2003)
4. రామచంద్రపురం మోడరన్ ఫౌండేషన్ వారి `కళానిధీ అవార్డు మరియు
 సాహితీ పురస్కారం (2004)
5. రావులపాలెం సి.ఆర్.సి. నాటక పరిషత్ కళాప్రాంగణంలో సినీ నటుడు,
  రచయిత శ్రీ తనికెళ్ళ భరణి సారధ్యంలో పౌర సన్మానం మరియు
  ఉగాది పురస్కారం (2004)
6. అనపర్తిలో ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ శ్రీ కె.ఆర్.సురేష్ రెడ్డి ,
  రాష్ట్ర మంత్రి శ్రీ జక్కంపూడి రామమోహనరావుల ద్వారా
  ఎస్.బి.ఎస్.ఆర్ కళాపీఠం వారి సాహితీ పురస్కారం (2004)
7. తూర్పు గోదావరి జిల్లా అధికార భాషా సంఖ సభ్యునిగా
 నియామకం (2006)
8. రాష్ట్ర ప్రభుత్వం రాజమండ్రిలో నిర్వహించిన నంది నాటకోత్సవాలలో
అభినందన సత్కారం(2008)
9. అభ్యుదయ రచయితల సంఖం, విశాఖ శాఖ అధ్వర్యంలో
 టర్నర్ చౌల్ట్రీలో జరిగిన మహాకవి శ్రీశ్రీ శతజయంతి ఉత్సవాలలో
 `పురిపండా సాహితీ పురస్కారం' (2009)
10. కాకినడ అల్లూరి సీతారామరాజు కళావేదిక రజతోత్సవాలలో
 ` అల్లూరి సీతారామరాజుస్మారక పురస్కారం' (2010)
11. విజయవాడ, ఎక్స్ - రే ఆధ్వర్యంలో జరిగిన మహాకవి
   శ్రీశ్రీ శతజయంతి ఉత్సవాలలో ` శ్రీశ్రీసాహితీ పురస్కారం' (2010)
12. గుంటూరు జిల్లా, అరసం ఆధ్వర్యంలో `కొండేపూడి శ్రీనివాసరావు
   సాహితీ పురస్కారం' (2010)
13. హైదరాబాదు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారిచే
 `సృజనాత్మక సాహిత్యం' లో కీర్తి పురస్కారం (2010)
14. `కవిరాజు త్రిపురనేని రామస్వామి - నార్ల వెంకటేశ్వర రా
వు  వారసత్వ      సెక్యులర్ అవార్డు (2011)
15. విశాఖపట్నం, కళాభారతి ఆడిటోరియంలో జాలాది కల్చరల్ ట్రస్ట్
  వారిచే `జాలాది సాహితీ పురస్కారం' (2012)
16. కొత్తపేటలో నన్నయ విశ్వవిద్యాలయం వైస్- చాన్సలర్ శ్రీ జార్జి విక్టర్
   ద్వారా `శ్రీనాధరత్నశిల్పి వుడయార్ కళాపురస్కారం '(2012)
17. కాకినాడ, సూర్యకళామందిరంలో రాష్ట్రమంత్రి శ్రీ తోట
   నరసింహం ద్వారా `తెలుగు నాటకరంగ దినోత్సవ పురస్కారం ' (2013)
18. గుంటూరు జిల్లా, నరసరావుపేటలో సాహితీ సమాఖ్యవారి `సంక్రాంతి సాహితీ  పురస్కారం' (2014)



...............................................................................................................









    

   











     














     






 





No comments:

Post a Comment